న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కిన గడప ఎక్కకుమండా ఎక్కారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నరేంద్ర మోడీలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మోడీ నుంచి తనకు సానుకూల స్పందన వచ్చిందని చంద్రబాబు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆదుకునే విషయంలో బిజెపి అధినాయకత్వం తొందర పడకపోవచ్చునని బిజెపి వర్గాలంటున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లిలతో ఓటుకు నోటు కుంభకోణం, చంద్రబాబు వాదన తదితర అంశాలపై బిజెపి చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు వేచి చూడాలనే అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు. ఓటుకు నోటు కుంభకోణంపై ఇంటలిజెన్స్ బ్యూరో అందజేసిన వివరాలను కూడా వారు సమీక్షించినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రధానంగా మూడు అంశాలపై తనకు సహాయం చేయాలని అడుగుతున్నట్లు తెలిసింది. ఓటుకు నోటు నుండి తనను రక్షించటం, రాష్ట్ర విభజన చట్టంలోని 8వ సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాదు శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించటం, ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో కొత్తవారిని నియమించడం అనే మూడు ప్రతిపాదనలను ఆయన కేంద్ర ప్రభుత్వం వద్ద పెట్టినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కోరికలను నెరవేర్చడం సాధ్యం కాకపోవచ్చునని బిజెపి అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు శాసన మండలి సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేయటం వలన పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారినట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందజేస్తామని చెబుతున్న ఎన్‌డిఏ ప్రభుత్వం ఓటుకు నోటు వ్యవహారంలో తల దూర్చటం మంచిది కాదన్నది మోదీ అభిప్రాయమని చెబుతున్నారు. చంద్రబాబును తప్పించాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి k.c.r తో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ విషయంలో మధ్యవర్తిత్వం నెరిపేది ఎవరనే సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. ప్రయత్నాలు చేసిన తర్వాత k c r అంగీకరించకపోతే తమకు కూడా అది చుట్టుకుంటుందనే అభిప్రాయంతో బిజెపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారం న్యాయస్థానంలో ఒక కొలిక్కి రావటమే మంచిదని బిజెపి నాయకులు భావిస్తున్నారు.

Advertisement

0 comments:

Post a Comment

 
Top